కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అస్తమయం

భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల కోసమే ఆమె పోరాటం, బానిస సంకెళ్లు తెంపేందుకే చివరి వరకు ఆరాటం, స్వతంత్ర రాజ్యం లో జీవించాలనే ఆకాంక్ష స్వరాజ్యం అనే ఆమె పేరు లోనే ఉన్నది. తెలంగాణ ముద్దుబిడ్డ యెర్ర జెండాకు  అండగా చేరింది, అరుణ పతాకమై రెపరెపలాడింది కామ్రేడ్ మల్లు స్వరాజ్యం.  

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నక్షత్రం నింగికెగసింది. తెలంగాణ ప్రజానీకం కన్నీరు కార్చింది. ఇక లేరనే సంగతి ప్రతి వ్యక్తి గుండెను బరువెక్కించింది.

భూమికోసం, భుక్తి కోసం, పీడిత వర్గ ప్రజల విముక్తికోసం, పదకొండేళ్ళ వయస్సులోనే పోరు బాట పట్టింది మల్లు స్వరాజ్యం.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరనే సంగతి ప్రతి వ్యక్తి గుండెను బరువెక్కించింది. మహిళల ధైర్యసాహసాలకు ప్రతిరూపకంగా నిలిచిన మల్లు స్వరాజ్యం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు మల్లు స్వరాజ్యం 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. మల్లు స్వరాజ్యం 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగులబెట్టారు. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. రజాకార్లపై తిరుగుబాటు లో మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు ఆమె. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం గారికి ఒక కూతురు ఆమె పేరు పాదూరి కరుణ , పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి , చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి  , వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు. మల్లు స్వరాజ్యం చిన్నతనం నుండే పోరాటమే ఊపిరిగా జీవించారు. నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి బావ రాజ రెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆనాటి దొరలు దురహంకారాన్ని ప్రశ్నిస్తూ పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లాలలో ఆమె పనిచేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి నడిపించారు. స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలు కాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగలబెట్టారు. ఆమెను పట్టుకుంటే పదివేలు బహుమతి ఇస్తామని ఆ నాటి నైజాం ప్రభుత్వం ప్రకటించింది. మద్యపాన నిషేధం పై 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. స్వరాజ్యం జీవిత కథ “నా మాటే తుపాకీ తూటా ” శీర్షికతో పుస్తకరూపంలో ప్రచురించారు. మల్లు స్వరాజ్యం ఉపన్యాసం అనర్గళ మైనది ఆమె గొంతెత్తితే  ప్రత్యర్థుల గుండెలు కదిలేవి. మహిళలపై దాడులు జరిగినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు, ఆమె తీవ్రంగా స్పందించేది. 91 ఏళ్ళ వయోభారం లోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా పనిచేశారు .ఎనిమిది దశాబ్దాల కిందట ఎర్ర జండా తో పెన వేసుకున్న మల్లు స్వరాజ్యం జీవితం ఆమె తుది శ్వాస వరకు అదే పోరాట స్ఫూర్తి  కొనసాగింది. గొప్ప పోరాట యోధురాలు, రాజకీయాలకు స్ఫూర్తిదాయకురాలు, ప్రజలు మెచ్చిన నాయకురాలు, ధైర్యసాహసాలకు, పరిపాలన దక్షతకు, త్యాగ నిరతికి, మహిళా శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిన మల్లు స్వరాజ్యం గారికి ఘన నివాళులు అర్పిస్తుంది NALGONDA DIARY.

– పులిజాల శ్రీనివాస రావు .

Related posts